: చిలక మనదే...పలుకు మాత్రం పరాయి రాష్ట్రానిది!: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం
టీడీపీ శాసనసభాపక్షనేత రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభా సమావేశాల సందర్భంగా హైదరాబాదు రోడ్ల తీరుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార పక్షాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు. హైదరాబాదు రోడ్లు దారుణంగా ఉన్నాయని, బంగారు తెలంగాణ అని మాటలు చెబితే సరిపోదని, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో రేవంత్ రెడ్డి ఆరోపణలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ, శాసనసభలో కొంత మంది వైఖరి దారుణంగా ఉందని పేర్కొన్నారు. వారి తీరు చిలక మనదే కానీ, పలుకు మాత్రం పరాయి రాష్ట్రానిది అని ఎద్దేవా చేశారు. వాళ్ల అధినేత మూటముల్లె సర్దుకుని పక్క రాష్ట్రానికి వెళ్లిపోయినా... కొంత శేషం మిగిలి ఉందని, వాళ్లు మాత్రం ఇక్కడ ఆ రాష్ట్ర పలుకులు పలుకుతుంటారని ఆయన ఎద్దేవా చేశారు.