: ట్రంప్ అధ్యక్షుడు అయినంత మాత్రాన... మా రోడ్ మ్యాప్ మారదు: సత్య నాదెళ్ల
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలను చేపట్టడానికి కేవలం గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అధ్యక్ష పీఠంపై కూర్చోకముందే పలుదేశాలకు ట్రంప్ వణుకు పుట్టించారు. తన మాట కాదంటే 'మ్యాటర్ వెరీ సీరియస్' అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చైనా లాంటి దేశాలు ట్రంప్ మాటలను కొట్టిపారేస్తున్నా... అమెరికా అధ్యక్షుడంటే ఆషామాషీ కాదనే విషయం వారికీ తెలుసు. ఇదంతా పక్కన పెడితే... ట్రంప్ అధ్యక్షుడైనా తమకు ఎలాంటి సమస్య లేదంటున్నాడు మన తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.
తమ సంస్థ ప్రధానమైన ఉపాధి అవకాశాలన్నీ అమెరికాలోనే ఉన్నాయని... యూఎస్ లో ఎక్కువ వేతనం కలిగిన ఉద్యోగాలను తాము భారీగా సృష్టించామని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ లో ప్రపంచవ్యాప్తంగా 1,13,000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 64వేల మందికి పైగా అమెరికాలోని వారే అని ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ అమెరికాకు ఎంతో సేవ చేస్తోందని... ట్రంప్ అధికారంలోకి వచ్చినంత మాత్రాన తమ రోడ్ మ్యాప్ మారదని చెప్పారు. ట్రంప్ కోరుకుంటున్నట్టుగానే తమ సంస్థలో సింహభాగం ఉద్యోగాలు అమెరికన్లకే ఇచ్చామని తెలిపారు.