: సమయం లేదు మిత్రమా! .. పని చూసుకో!: ఒబామాపై ఉత్తరకొరియా వ్యంగ్యం
ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కులను కాలరాస్తున్నవారంటూ ఏడుగుర్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడుగురిలో ఎవరూ ఊహించని వ్యక్తి ఒకరున్నారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చిన్న చెల్లెలు కిమ్ జో జాంగ్. ఈమె సాధారణంగా మీడియా ముందుకు రారు. 2011లో కిమ్ జాంగ్-2 అంత్యక్రియలప్పుడు కూడా ఆమె బయటకు రాలేదు. చాలా కాలం అజ్ఞాతంలో ఉన్న ఆమె, గత ఏడాదిన్నర కాలంగా ఉత్తరకొరియాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నియంత కింగ్ జాంగ్ ఉన్ కు ఆమె సలహాదారుగా పని చేస్తూ, అణుపరీక్షలు నిర్వహిస్తూ, తమ వద్ద హైడ్రోజన్ బాంబులున్నాయంటూ అమెరికాను కవ్వించడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ తనే!
ఈ నేపథ్యంలో ఆమెపై అమెరికా నిషేధం విధించింది. దీంతో ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తీవ్రంగా స్పందించింది. దీంతో 'మిత్రమా ఒబామా! నువ్వు దిగిపోవడానికి సమయం తక్కువగా ఉందిగా... మానవ హక్కులు, అదీ ఇదీ అంటూ ఎందుకు టైమ్ వేస్టు చేస్తావు? సామాన్లు సర్దుకునే పని ఉందిగా, తొందరగా కానివ్వు' అంటూ వ్యంగ్యం ప్రదర్శించింది.