: అఖిలేష్ తరపున ఉత్తరప్రదేశ్ లో ప్రచారానికి సిద్ధం!: లాలూప్రసాద్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తరుపున ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో కలసి సిద్ధంగా ఉన్నానని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అఖిలేష్ విజయం సాధించే దిశగా ఆయన తరపున ప్రచారం నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ పోటీ చేయదని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీని ఓడించేందుకు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. సోనియా, అఖిలేష్ చేతులు కలపాలని ఆకాంక్షించిన ఆయన, అఖిలేష్ కు ములాయం మద్దతు తెలుపాలని, ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం చేకూరుతుందని హెచ్చరించారు. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా ఆయన అఖిలేష్ యాదవ్ తో కలవాలని లాలూ సూచించారు. 'నేతాజీ, అఖిలేష్ ని ఆశీర్వదించి, ఏకం కావాల'ని ఆయన సూచించారు. అలా అయితే ప్రత్యర్థులను ఓడించడం ఏమాత్రం కష్టం కాదని ఆయన తెలిపారు.