: 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పన్ను మినహాయింపులు ఇవ్వడం వేస్ట్: కరీంనగర్ కౌన్సిల్ సభ్యులు
బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. చారిత్రాత్మక చిత్రం అనే కారణంగా ఈ మినహాయింపులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఈ సినిమాకు పన్ను మినహాయింపులు ఇవ్వడంపై ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కరీంనగర్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ జాబితాలో చేరారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం వేస్ట్ అని వారు అంటున్నారు.
ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని కౌన్సిల్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక సినిమాను చూడాలంటూ ప్రజలను ప్రోత్సహించడానికే పన్ను మినహాయింపులను ప్రభుత్వం ఇస్తుందని... అయితే, ఆ మేరకు థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలను తగ్గించి అమ్మాలని... కానీ, టికెట్ ధరలను ఏమాత్రం తగ్గించకుండానే థియేటర్ యాజమాన్యాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సభ్యులు మండిపడుతున్నారు.