: వీరంతా స్థానికేతరులే... తమిళులుకారు!: రజనీకాంత్, జయలలితలపై నటి రాధిక సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో స్థానికేతరులు రాజ్యమేలుతున్నారని, వారిని నిలువరించాలని నటి రాధిక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంజీఆర్, జయలలిత, రజనీకాంత్, వైగో, విజయ్ కాంత్ తదితరులంతా స్థానికేతరులేనని ఆమె విమర్శించారు. వీరిని ఆదరించాల్సిన అవసరం తమిళులకేంటని ప్రశ్నించారు. ఇప్పటికే రజనీకాంత్ ను ఔట్ సైడర్ అని శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో శరత్ కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు.
ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన రాధిక, స్థానికేతరుల పేర్లను ప్రస్తావిస్తూ, నడిగర సంఘం నేత విశాల్ ను కూడా టార్గెట్ చేశారు. విశాల్ రెడ్డి కులస్తుడని, ఆంధ్రా నుంచి వచ్చాడని చెబుతూ, "విశాల్ ఎవరు? విశాల్ రెడ్డి. కార్తి, శివరామ్ ఎవరు? వీరంతా తమిళులా? వారి వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. జయలలిత సైతం పుట్టుకతో తమిళురాలు కాదని అన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, ఇక్కడ రాజ్యమేలుతున్నారని విమర్శించారు. రాధిక వ్యాఖ్యలు తమిళనాడులో ఇంకెంత కలకలం రేపుతాయో!