: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా ఇతర కేంద్రాల కోసం టీడీపీ 'లెజండరీ' రక్తదాన శిబిరాలు!: నారా భువనేశ్వరి
దివంగత ఎన్టీ రామారావు వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో 'లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్' పేరిట ప్రత్యేక రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు మెంబర్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తనిధితో పాటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు పాల్గొంటాయని పేర్కొన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగే కార్యక్రమంలో తనతో పాటు బ్రహ్మణి ఈ రక్తదాన శిబిరాలను ప్రారంభిస్తారని, విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటయ్యే శిబిరంలో లోకేష్ పాల్గొంటారని వెల్లడించారు. గత సంవత్సరం 145 చోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించగా, ఈ సంవత్సరం మరిన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.