: రూ. 10 కోసం గొడవ... నలుగురిలో తూలనాడారన్న బాధతో సజీవ దహనమైన మహిళ!
కేవలం పది రూపాయల కోసం ప్రారంభమైన గొడవ కారణంగా, ఓ మహిళను నలుగురూ చూస్తుండగానే నానా మాటలూ అనగా, మనస్తాపంతో ఆమె నిప్పంటించుకుని మరణించింది. ఈ ఘటన పుణె సమీపంలోని జనవాడి ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ప్రాంతంలో నివసించే పరశురామ్ భార్య సుందరమ్మ (30) తన కుమారుడికి రూ. 10 ఇచ్చి, కిరణా షాపుకు పంపింది.
ఈ క్రమంలో పొరుగింట్లో ఉండే రాహుల్ అనే అబ్బాయి, ఆ నోటును లాక్కుపోయాడు. కుమారుడి ఫిర్యాదుతో విషయాన్ని అడిగేందుకు వచ్చిన సుందరమ్మను, రాహుల్ తల్లిదండ్రులు నానా మాటలూ అన్నారు. తమ బిడ్డను దొంగగా ఆరోపిస్తోందని తిడుతూ, చంపేస్తామని బెదిరించారు. దీంతో నలుగురిలో పరువు పోయిందని భావించిన ఆమె, ఇంట్లోకి వెళ్లి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుందరమ్మ మరణించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు పొరుగింట్లో ఉన్న 35 ఏళ్ల మహిళను, ఆమె కుమారుడు లక్ష్మణ్ గైక్వాడ్ (19)ను అరెస్ట్ చేసి, మరో 12 ఏళ్ల బాలికపై కేసు నమోదు చేశారు.