: తాడిపత్రి టీడీపీలో ముసలం... తార స్థాయికి చేరుకున్న విభేదాలు!
అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీలో విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పార్టీకి చెందిన మరో వర్గమైన జగదీశ్వర్ రెడ్డి సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు రవీంద్రరెడ్డి అవినీతిపై జగదీశ్వర్ రెడ్డి అనుచరులు తాడిపత్రి పట్టణంలో కరపత్రాలు విడుదల చేశారు. దీంతో, జేసీ వర్గం భగ్గుమంది. ఇరువర్గాలు కూడా బహిరంగ చర్చకు సై అంటే సై అంటున్నాయి. దీంతో తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అంతేకాదు, ముందస్తుగా రవీంద్రరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.