: దీప నాయకత్వంలో శశికళపై తిరుగుబాటుకు రెబల్స్ ప్రయత్నాలు!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా, ఇంటికే పరిమితమైన శశికళ, ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో కల్పించుకోవడాన్ని భరించలేకపోతున్న అన్నాడీఎంకే ప్రజా ప్రతినిధుల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జయలలిత మేనకోడలు, ఆమె వారసురాలిగా దీపా జయకుమార్ అసంతృప్త నేతలకు కొండంత అండగా కనిపిస్తున్నారు. ఆమె నాయకత్వంలో శశికళపై తిరుగుబాటు చేయాలని అన్నాడీఎంకే రెబల్స్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటి వరకూ సమయం వచ్చినప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తానని చెబుతూ వచ్చిన దీప, నేడు ఎంజీఆర్ సమాధి ఎదుట పాలిటిక్స్ లోకి వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శశికళకు ఊహించని షాక్ ఇచ్చేందుకు వీరు సిద్ధమవుతున్నట్టు దీప వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో చీలిక తప్పదని భావిస్తున్నారు.

మరోవైపు చిన్నతనం నుంచి జయలలిత నివాసంలోనే పెరిగినప్పటికీ, ఆ తరువాత ఆమెకు దూరమైన దీపకు, ఇప్పుడు వస్తున్న ప్రజా మద్దతు, వెల్లువెత్తుతున్న అన్నాడీఎంకే కార్యకర్తలను చూస్తున్న రాజకీయ నిపుణులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీప వద్దకు వచ్చేవారి సంఖ్యను చూస్తుంటే, శశికళపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతోందని అంటున్నారు. గడచిన నెల రోజులుగా చెన్నై పాండీ బజార్ లోని దీప ఇంటి ముందు వందలాది మంది కార్యకర్తలు నిత్యమూ నినాదాలు చేస్తూ, ఆమె రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సన్నిహితులతో చర్చించిన దీప, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని నేడు క్లారిటీ ఇచ్చారు.

ఇక తమిళనాడులో దీపకు మద్దతుగా పలు సంఘాలు ఏర్పడుతున్నాయి. జయలలిత ప్రాతినిధ్యం వహించిన శ్రీరంగంలో 'జయ-దీప పెరవై' పేరిట ఓ యువసేన ఏర్పాటైంది. దీనిలో దాదాపు 10 లక్షల మంది సభ్యులున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయపు తొలి అడుగులను దీప ఎలా వేయనున్నారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News