: అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. శశికళ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాషాయమయం చేసేందుకు, ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సోమవారం ఆయన తంజావూరులో ఆరోపించారు. అయితే బీజేపీ ఆటలను సాగనివ్వబోమని పేర్కొన్నారు. తాము కుటుంబ రాజకీయాలే చేస్తున్నామని, ఇందులో దాపరికం లేదని తేల్చి చెప్పారు.
ఎంజీఆర్ మృతి తర్వాత జయలలితను కాపాడింది తామేనన్నారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సమర్థంగానే పనిచేస్తున్నారని, ఇప్పటికిప్పుడు ఆయనను మార్చే ఉద్దేశం తమకు లేదన్నారు. శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలా? వద్దా? అనేది శాసనసభ్యుల నిర్ణయం ప్రకారం ఉంటుందన్నారు. ప్రస్తుతానికైతే పన్నీర్ సెల్వంను మార్చే ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలను కలిసి కట్టుగా అడ్డుకోవాలని కార్యకర్తలు, నాయకులకు నటరాజన్ పిలుపునిచ్చారు.