: సినిమాలు, మద్యం, హీరోయిన్లు.. ఇదే రాజ్‌కపూర్ లోకం..!: తండ్రి గురించి సంచలన విషయాలు వెల్లడించిన రిషికపూర్
నిన్నటి తరం బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్(64) తన స్వీయ జీవిత చరిత్ర 'ఖుల్లాం ఖుల్లా: రిషికపూర్ అన్ సెన్సార్డ్' పేరుతో విడుదల చేసిన పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు. తన తండ్రి, బాలీవుడ్ సూపర్‌స్టార్ అయిన రాజ్‌కపూర్ గురించి ఎవరికీ తెలియని విషయాలను అందులో పేర్కొన్నారు. సినిమాలు, హీరోయిన్లు, మద్యం తాగడం.. ఇవే తన తండ్రి లోకమని, నర్గీస్, వైజయంతీమాల తదితర హీరోయిన్లతో తన తండ్రికి సంబంధాలు ఉండేవని అందులో పేర్కొన్నారు. అలాగే తన చిన్ననాటి అనుభవాలు, తన కొచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి కూడా అందులో ప్రస్తావించాడు.
అలాగే భారత మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను తాను దుబాయ్‌లో రెండుసార్లు కలిశానని, అతడితో కలిసి టీ కూడా తాగానని పేర్కొన్నాడు. తొలిసారి 1988లో దుబాయ్‌లో ఆశా భోంస్లే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తన వద్దకు దావూద్ మనిషి ఒకరు వచ్చి దావూద్ ఇంటికి తీసుకెళ్లాడని రిషి కపూర్ పేర్కొన్నారు. అక్కడ తనను దావూద్ సాదరంగా ఆహ్వానించాడని, తాను మద్యం తాగనని, అందుకే టీకి పిలిచానని దావూద్ తనతో చెప్పాడని రిషి పుస్తకంలో వివరించారు.
మరోసారి 1989లో దుబాయ్‌లోనే ఓ లెబనీస్ షాపులో బూట్లు కొనుక్కునేందుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న దావూద్‌ని మరోసారి కలిశానని చెప్పాడు. ఆయన చేతిలో మొబైల్ ఫోన్, చుట్టూ పదిమంది బాడీగార్డులు ఉన్నారని పేర్కొన్నాడు. షాపులో తనకేం కావాలో తీసుకోమని చెప్పినా తాను తిరస్కరించానని రిషి తెలిపారు. భారత్‌లో ఎంతోమంది రాజకీయ నేతలు తన జేబులో ఉన్నారని, వారికి చాలా డబ్బు పంపించానని దావూద్ తనకు చెప్పాడని రిషికపూర్ తన జీవిత చరిత్రలో వివరించారు.