: ఫ్రీగా ఇవ్వలేదు.. పాక్‌కు యుద్ధనౌకలను అమ్మేశాం!: చైనా
పాకిస్థాన్‌కు సాయపడుతూ ఆ దేశాన్ని రెచ్చగొడుతోందని భారత్ నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న చైనా ఇటీవల పాక్‌కు రెండు యుద్ధ నౌకలను ఉచితంగా ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను చైనా ఖండించింది. తాము ఆ దేశానికి యుద్ధ నౌకలను బహూకరించలేదని, రెండు దేశాల మధ్య సైనిక వాణిజ్య నిర్వహణలో భాగంగానే ఆ యుధ్ద నౌకలను పాక్‌కు అమ్మడం జరిగిందని చెప్పింది. తాము అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే నిఘా నౌకలను సైనిక వాణిజ్య సహకారంలో భాగంగా ఆ దేశానికి అందించామని పేర్కొంది.
ఇరు దేశాల ఎకనామిక్ కారిడార్‌ను పర్యవేక్షించేందుకు తమకు రెండు నౌకలను గిఫ్ట్‌గా ఇచ్చిందని, ఇవి సీపెక్ సముద్ర రూటులో సంయుక్త భద్రతా సమీక్షను నిర్వహిస్తాయని ఇటీవలే పాకిస్థాన్ మీడియా పేర్కొంది. వాటిని తమకు అందించిన అనంతరం చైనా మరో రెండు కొత్త నౌకలను అభివృద్ధి చేస్తోందని పాక్ పత్రిక డాన్ పేర్కొంటూ.. వాటిని సైతం త్వరలోనే తమ నేవీకి చైనా ఇవ్వనున్నట్లు పేర్కొంది. పాక్ పత్రిక ప్రచురించిన ఈ వార్తలనే చైనా ఖండించింది.