: తనకన్నా ఆరేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకున్న యువతి... 'తప్పు చేశా'నంటున్న భర్త.. భార్య ఆత్మహత్యాయత్నం!
తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి, తన భర్తను అత్తమామలు తీసుకెళ్తే, తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుంతకల్ కు చెందిన రాజేశ్వరి (27) అప్పటికే పెళ్లై విడాకులు తీసుకుంది. తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన కర్నూలు యువకుడు సాయి ఈశ్వర్ ను ఫేస్ బుక్ లో చూసి ఇష్టపడింది. ప్రేమకు వయసు అడ్డుకాదని భావించిన ఈశ్వర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలసి హైదరాబాద్ లో కాపురం పెట్టగా, రాజేశ్వరి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇప్పుడామె గర్భవతి కూడా.
ఇదిలా ఉంచితే, తమ కుమారుడికి పెళ్లయిందని, అతను హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసుకున్న ఈశ్వర్ తల్లిదండ్రులు, తమ బిడ్డ ఇంకా మైనరేనని, 21 సంవత్సరాలు దాటలేదని చెబుతూ అతన్ని తీసుకెళ్లారు. ఆపై భర్త కోసం కర్నూలు వెళ్లిన రాజేశ్వరికి తీవ్ర నిరాశ ఎదురైంది. తాను తల్లిదండ్రులతోనే ఉంటానని ఈశ్వర్ చెప్పడంతో బ్లేడుతో చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయం నుంచి బయటపడింది. తన భర్తను పంపాలని వేడుకుంటోంది.
కాగా, తాను తల్లిదండ్రులకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు ఈశ్వర్ చెబుతుండటం గమనార్హం. తనకు గతంలో వివాహమైన విషయం భర్తకు తెలుసునని రాజేశ్వరి అంటుండగా, ఈశ్వర్ మాత్రం అమ్మానాన్నలు ఏం చెబితే, అది చేస్తానని పేర్కొంటున్నాడు. ఈ విషయంలో పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.