: అట్టుడుకుతున్న అలంగనళ్లూరు... పోలీసుల లాఠీచార్జ్ లో పలువురికి గాయాలు
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేలా జల్లికట్టు నిర్వహించాల్సిందేనని ఓపక్క తమిళ తంబీలు, కోర్టు ఆదేశాల మేరకు అడ్డుకుని తీరుతామని మరోపక్క పోలీసులు పట్టుదలకు పోవడంతో తమిళనాడులోని అలంగనళ్లూరు రక్తసిక్తమైంది. పశువులకు పూజలు చేసిన అనంతరం వాటిని వీధుల్లోకి తీసుకురాగా, అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ప్రజలను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ప్రజలు పోలీసులపైకి తిరగబడటంతో, లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.
చిన్నా పెద్దా అని చూడకుండా పోలీసులు విచక్షణా రహితంగా విరుచుకుపడటంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల లాఠీలు తగిలిన వారిలో నాలుగు, ఐదేళ్ల చిన్న పిల్లలు కూడా ఉండటంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగాయి. వీధుల్లోకి దూసుకొచ్చిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కాగా, అదనపు బలగాలను రప్పించిన అధికారులు ఎద్దులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు.