: హైదరాబాద్ నుంచి విశాఖకు 40 నిమిషాల్లో ప్రయాణం... భూమార్గంద్వారానే సుమా!


అవును, ఇదేదో సినిమాలో సీన్ కాదు, కల అంతకంటే కాదు... ఆచరణ సాధ్యం అంటోంది అమెరికాకు చెందిన ఓ కంపెనీ. గాలికంటే వేగంగా ప్రయాణించడం ద్వారా ఇది సాధ్యమని చెబుతోంది. ఇందుకోసం ట్రావెల్ పాడ్ అనే కొత్త తరహా రవాణా వ్యవస్థను పరిచయం చేస్తానంటోంది. ట్రావెల్ పాడ్ లో గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చన్నది ఈ సంస్థ వాదన. పిల్లర్లపై పొడవాటి పెద్ద పైపులైన్ ను ఏర్పాటు చేస్తారు. దాన్ని గాలి కూడా చొరబడకుండా పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. లోపల శూన్యంలో తేలుతూ సదరు పాడ్ ప్రయాణిస్తుంది. ఇలా అయితే చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాలే పడుతుందంటోంది.

చెన్నై-బెంగళూరు, చెన్నై -ముంబై, బెంగళూరు-తిరువనంతపురం, ముంబై-ఢిల్లీ మార్గాలపై ఆసక్తితో ఉన్నట్టు హైపర్ లూప్ ఇటీవలే ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసింది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి కూడా తన ఆసక్తిని వ్యక్తీకరించింది. అయితే, అధికార వర్గాల సమాచారం ప్రకారం హైపర్ లూప్ ఆసక్తిగా ఉన్న మార్గాల్లో బుల్లెట్ రైళ్లను నడిపాలన్న యోచనలో కేంద్రం ఉంది. దీనికోసం జపాన్, చైనా బృందాలు ఇప్పటికే అధ్యయనం కూడా ప్రారంభించాయి.

హైపర్ లూప్ చెబుతున్నదాని ప్రకారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 610 కిలోమీటర్లను కేవలం 40 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకు పావుగంటలోనే వెళ్లిపోవచ్చు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ట్యూబులను తీసుకొచ్చి పిల్లర్లపై ఏర్పాటు చేయడం ద్వారా త్వరగా ప్రాజెక్టులను ప్రారంభిస్తామని హైపర్ లూప్ చెబుతోంది. ట్యూబులపై సోలార్ ప్యానెళ్లు, పిల్లర్లకు గాలిమరలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ అవసరాలను తీర్చుకుంటామంటోంది. ఈ ట్యూబుల్లో ప్రయాణించే పాడ్స్ విద్యుదయస్కాంత శక్తితో నడుస్తాయని, ప్రారంభం కావడానికే విద్యుత్ అవసరమని, ఒక్కసారి టాప్ స్పీడ్ కు వెళ్లిన తర్వాత విద్యుత్ లేకుండా 200 కిలోమీటర్లు ప్రయాణించగలదని హైపర్ లూప్ అంటోంది. ఈ సరికొత్త రవాణా వ్యవస్థ వచ్చే ఐదేళ్లలో దుబాయి - అబుదాబి మధ్య పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు.

ఒక కిలోమీటరు హైస్పీడ్ రైల్వే లైను వేయడానికి రూ.300 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా ఉండగా... హైపర్ లూప్ మాత్రం ట్రావెల్ పాడ్ రవాణా వ్యవస్థకు కిలోమీటర్ కు రూ.70కోట్లు మాత్రమే అవుతుందని చెబుతోంది. అయితే, ఇంత భారీ వ్యయం రీత్యా చార్జీలు అధికంగా విధించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఆసక్తిగా లేదన్నది అధికార వర్గాల సమాచారం. 

  • Loading...

More Telugu News