: జన్ ధన్ ఖాతాలైతే రూ. 30 వేలు, మిగతావారు రూ. 2.5 లక్షలే డిపాజిట్ చేసుంటే తప్పించుకున్నట్టే!
నోట్ల రద్దు తరువాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసిన అధిక మొత్తాలపై విచారణ జరిపి భారీగా పన్నులను విధించడం ద్వారా అక్రమార్కుల భరతం పట్టాలని భావిస్తున్న నరేంద్ర మోదీ సర్కారు ఓ మెట్టు దిగింది. ప్రతి ఖాతాపైనా విచారణలు జరిపితే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న కేంద్రం, వ్యక్తిగత ఖాతాల్లో వచ్చిన డిపాజిట్లపై, విచారణకు కొంత పరిమితులు విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జన్ ధన్ ఖాతాలైతే రూ. 30 వేల వరకూ, గృహిణులు, చిన్న వ్యాపారులు అయితే, రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ డిపాజిట్ కు పరిమితమైతే, వారిపై ఎలాంటి ప్రశ్నలూ సంధించరాదని, వారిని విచారణలో భాగం చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ, నోట్ల రద్దు ప్రధానాస్త్రంగా విపక్షాలు ప్రజల్లోకి వెళుతుంటే, వచ్చే వ్యతిరేకతను అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాన్యులను వేధించరాదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆదాయపు పన్ను అధికారుల సమాచారం మేరకు దాదాపు రూ. 4 లక్షల కోట్ల వరకూ లెక్కలోకి రాని ధనం బ్యాంకు ఖాతాల్లోకి చేరి వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.