: కూల్ డ్రింక్స్, పిజ్జాల ధరలకు రెక్కలు... బడ్జెట్ లో పన్నుల మోత...?


ప్రజారోగ్య పరిరక్షణపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న అధిక కొవ్వు, తియ్యటి ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా వాటిపై కొవ్వు పన్ను (ఫ్యాట్ ట్యాక్స్)ను విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిజ్జా, బర్గర్ వంటి అధిక కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలు, తియ్యటి పానీయాలపై పన్నుల మోత మోగించనుంది. లైఫ్ స్టయిల్ డీసీజెస్ (జీవన విధానం కారణంగా వచ్చే వ్యాధులు) మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు పెరిగిపోతుండడాన్ని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, తియ్యటి పానీయాలపై కొవ్వు పన్ను విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల బృందం ఇటీవల ప్రధాని మోదీతో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నగరాభివృద్ధి అంశాలపై జరిగిన సమావేశంలో పన్ను అంశాన్ని ప్రతిపాదించినట్టు తెలిసింది. అధిక పన్నులు విధించడం ద్వారా వచ్చే నిధులను ప్రజారోగ్యంపై వెచ్చించాలని ఆ బృందం సూచించింది. ఈ విషయాన్ని సెక్రటరీల బృందంలో సభ్యుడైన ఓ అధికారి వెల్లడించారు. వాస్తవానికి ఈ తరహా ఆహార పదార్థాలపై అధిక పన్ను విధించే ఆలోచన గతేడాది ఏప్రిల్ నుంచీ ఉంది. జంక్ ఫుడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు కేంద్ర సర్కారు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అధిక పన్నులు విధించడంతోపాటు, ఈ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను టీవీల్లో ప్రైమ్ షోలలో వేయకుండా నివారించడం తరహా ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇప్పటికే జంక్ ఫుడ్ నియంత్రణకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు చేస్తోంది.  

  • Loading...

More Telugu News