: ఇండియాలో పరిస్థితి ఇది... 57 మంది వద్ద పేరుకుపోయిన 70 శాతం సంపద!


ప్రపంచంలోని సగం సంపద ఎనిమిది మంది బిలియనీర్ల వద్ద ఉందని వెల్లడించిన హక్కుల సంస్థ 'ఆక్స్ ఫామ్' ఇండియా గురించి కూడా ఆసక్తికర అంశాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా విడుదల చేసింది. ఇండియాలోని 57 మంది బిలియనీర్ల వద్ద 216 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14.58 లక్షల కోట్లు) ఉన్నాయని, ఇది 70 శాతం అట్టడుగు ప్రజల ఆస్తుల విలువకు సమానమని వెల్లడించింది.

'యాన్ ఎకానమీ ఆఫ్ 99 పర్సెంట్' పేరిట ఓ నివేదికను విడుదల చేస్తూ, గడచిన రెండేళ్లలో ఇండియాలోని ధనికులు మరింతగా ధనవంతులైతే, పేదలు మరింత పేదలుగా మారారని వెల్లడించింది. ఇండియాలో 84 మంది బిలియనీర్లు (ఆస్తి విలువ కనీసం రూ. 6,750 కోట్లకు పైగా) ఉండగా, వారి వద్ద 248 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.74 లక్షల కోట్లు) ఆస్తులున్నాయని తెలియజేసింది.

భారత మొత్తం సంపద 3.1 ట్రిలియన్ డాలర్లని తెలిపింది. వచ్చే 20 సంవత్సరాల్లో 500 మంది వద్ద 2.1 ట్రిలియన్ డాలర్ల సంపద చేరుతుందని భావిస్తున్నామని, అప్పటికి దేశ జనాభా 130 కోట్లను దాటుతుందని ఆక్స్ ఫామ్ తన నివేదికలో అంచనా వేసింది. అట్టడుగు నుంచి ఉన్న ప్రజల్లో 10 శాతం మంది తమ సంపదలో దాదాపు 15 శాతాన్ని కోల్పోయారని వెల్లడించింది. మహిళలకు వేతనాలు ఇవ్వడంలోనూ, దినసరి కూలీల చెల్లింపులోను తీవ్ర అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వారికి సరైన ఫలితం దక్కడం లేదని చెప్పింది.

  • Loading...

More Telugu News