: ప్రేమ పేరిట 13 ఏళ్ల బాలుడిపై ఉపాధ్యాయురాలి వల... పదేళ్ల జైలు శిక్ష
విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లల్ని మంచి మార్గంలో పెట్టి భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన వృత్తికి కళంకం తెచ్చిందో ఉపాధ్యాయురాలు. ప్రేమిస్తున్నాని చెబుతూ, 13 ఏళ్ల బాలుడితో సంబంధం పెట్టుకున్న అలెక్సాండ్రియా వెరా (25) అనే యువతికి పది సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. సదరు బాలుడితో తన సంబంధం నిజమేనని ఆమె అంగీకరించడంతో, హూస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి మైఖేల్ మెక్ స్పాడెన్ శిక్షను ఖరారు చేశారు. ఆమె తన చర్యలతో సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిందని వ్యాఖ్యానించారు.
తొలుత ఇన్ స్టాగ్రామ్ మెసేజ్ లతో తమ పరిచయం జరిగిందని, ఆపై ఇద్దరమూ రొమాన్స్ చేశామని, బాలుడి కుటుంబ సభ్యుల్లోని ఓ వ్యక్తి తమ బంధాన్ని అంగీకరించాడని వెరా కోర్టుకు తెలిపింది. తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. తన ఇంటికి అతన్ని తీసుకెళుతూ, ఇరుగుపొరుగు వారికి సోదరుడని అబద్ధాలు చెప్పింది. వెరాకు 6 ఏళ్ల కుమార్తె ఉండగా, ఆ బాలికతో 13 ఏళ్ల బాలుడిని 'నాన్నా' అని పిలిపించింది. ఈ కేసులో భాగంగా వెరాను గత సంవత్సరం జూన్ లో అరెస్ట్ చేయగా, ఆమెకు గరిష్ఠంగా జీవిత ఖైదు పడాల్సింది. కానీ ఆమె తప్పును అంగీకరించడంతో శిక్ష తగ్గింది. ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించిన తరువాత ఆమెకు పెరోల్ లభించవచ్చని 'డల్లాస్ మార్నింగ్ న్యూస్' పేర్కొంది.