: శామ్‌సంగ్ కంపెనీ వైస్ ఛైర్మన్ అరెస్టుకు సన్నాహాలు
దక్షిణ కొరియా అధ్యక్షురాలి అవినీతి కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న శామ్‌సంగ్ వైస్ ఛైర్మన్ జె యంగ్ లీని అరెస్టు చేయడానికి అక్కడి పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో జె యంగ్ లీ పేరు ప్రధానంగా వినిపిస్తోందని అయితే, ఆయనను అదుపులోకి తీసుకుంటే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని తాము దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతున్నట్లు కొరియా స్పెషల్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఆయనను అరెస్టు చేసే విషయంపై ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తోన్న అధికారులు శాంసంగ్ వైస్ ఛైర్మన్‌ను అరెస్టు చేస్తే పడే ప్రభావంపై నివేదిక ఇస్తారని తెలిపారు. ఆయన 2015లో సుమారు రూ.175 కోట్ల విలువైన నగదును ప్రస్తుత అధ్యక్షురాలు పార్క్ జియోన్ హైస్‌కు చెందిన ఓ కంపెనీకి మళ్లించారు. ఈ నగదును రెండు సంస్థల కొనుగోలుకు సంబంధించి శామ్‌సంగ్‌కు సాయం చేసేందుకే అప్పజెప్పినట్లు అధికారులు భావిస్తున్నారు.