: పదేళ్ల తరువాత మరో కెప్టెన్ నాయకత్వంలో ఆడనున్న ధోనీ
నేడు ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభం కానున్న వన్డే సిరీస్ లో భాగంగా, పుణెలో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు పదేళ్ల తరువాత మహేంద్ర సింగ్ ధోనీ, మరో కెప్టెన్ నాయకత్వంలో మైదానంలోకి దిగనున్నాడు. ఇదే సమయంలో టెస్టు జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్న విరాట్ కోహ్లీ, అన్ని ఫార్మాట్ జట్ల బాధ్యతలనూ స్వీకరించి, పూర్తి స్థాయి కెప్టెన్ గా ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే.
దీంతో ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం కాగా, టెస్టు సిరీస్ ను ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు, పగ తీర్చుకోవాలని భావిస్తోంది. జట్టులో జేసన్ రాయ్, హేల్స్, బట్లర్ వంటి హిట్టర్లతో నిండిన ఇంగ్లండ్ ను తక్కువగా అంచనా వేసేది లేదని కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. భారత జట్టులోకి పునరాగమన అవకాశాన్ని దక్కించుకున్న యువరాజ్ సింగ్ ఆటపైనే అందరి దృష్టీ ఉంది. ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టికెట్లన్నీ అమ్ముడుకాగా, అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లడం ఖాయం.