: పార్థివ్ విజృంభణతో నెరవేరిన ఏడు దశాబ్దాల గుజరాత్ కల!
గుజరాత్ ఏడు దశాబ్దాల కల నెరవేరింది. రాష్ట్ర చరిత్రలో అందని ద్రాక్షగా మిగిలిపోయిన రంజీ ట్రోఫీని తొలిసారిగా అందించాడు పార్థివ్ పటేల్. దీంతో 42వ సారి ట్రోఫీ సాధించాలన్న ముంబై కల నెరవేరకుండా పోయింది. ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 143 పరుగులు చేసిన పార్థివ్, జట్టును 5 వికెట్ల తేడాతో నెగ్గించి, ట్రోఫీని అందించాడు. గెలవాలంటే 312 పరుగుల భారీ స్కోరును చేయాల్సి వుండగా, మన్ ప్రీత్ కు జోడీగా బరిలోకి దిగిన కెప్టెన్ పార్థివ్ అదరగొట్టాడు. ఆపై తన జట్టుకు అద్భుత కానుకను అందించాడు.
వాస్తవానికి రంజీ చరిత్రలో గుజరాత్ ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరింది. ఆ మ్యాచ్ లో తుది మెట్టుపై బోల్తా పడింది. ఇక తాజా మ్యాచ్ లో ముంబై తొలి ఇన్నింగ్స్ లో 228, రెండో ఇన్నింగ్స్ లో 411 పరుగులు చేయగా, గుజరాత్ తొలి ఇన్నింగ్స్ లో 328, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.