: కాజల్ హీరోయిన్ అనగానే చాలా టెన్షన్ పడ్డా!: చిరంజీవి
'ఖైదీ నంబర్ 150' సినిమాకు కాజల్ ను కానీ, అనుష్కను కానీ తీసుకోవాలనే ఆలోచన దర్శకుడు వినాయక్ కు ముందు నుంచి ఉందని... చివరకు కాజల్ నే ఫైనలైజ్ చేశారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హీరోయిన్ గా కాజల్ ఫైనలైజ్ కావడంతో అందరూ హ్యాపీగా ఉన్నారని... తాను మాత్రం చాలా టెన్షన్ పడ్డానని అన్నారు. చరణ్ తో, పవన్ కల్యాణ్ తో, బన్నీతో కాజల్ నటించిందని... చరణ్, కాజల్ లు యంగ్ పెయిర్ అని... అలాంటిది తన పక్కన కాజల్ ఎలా సెట్ అవుతుందో అని అనుకున్నానని తెలిపారు.
అనుష్క అయితే సెట్ అవుతుందని... ఆమెనే హీరోయిన్ గా తీసుకుందామని తాను భావించానని చెప్పారు. కాజల్ తో ఎక్కువ ఏజ్ గ్యాప్ కనిపిస్తుందేమోనని... కొంచెం ఎక్కువ వయసున్న హీరోయిన్ అయితే బాగుంటుందనేది తన ఆలోచన అని అన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత తాను, కాజల్ ఉన్న ఒక స్టిల్ పబ్లిసిటీ కోసం బయటకు వచ్చిందని... ఆ స్టిల్ లో కాజల్ పక్కనున్నది చరణ్ అని తన భార్య సురేఖ భావించిందని... ఆ తర్వాత పరీక్షగా చూసి, 'మీరా?' అంటూ ఆశ్చర్యపోయిందని... 'ఇద్దరూ భలే ఉన్నారే, బాగా సెట్ అయింది' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందని చెప్పారు. సురేఖ మాటతో, 'చాలు.. పాస్ అయిపోయావ్' అని తనకు తాను అనుకున్నానని అన్నారు. సురేఖకు నచ్చినప్పుడు అందరికీ నచ్చుతుందనే నమ్మకం తనకు కలిగిందని చెప్పారు.