: కోర్టుకు వెళ్తా... తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎన్నికల బరిలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం సంచలనంగా మారింది. అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ ఇంకా ఎత్తివేయలేదన్న కారణంగా నామినేషన్ ను తిరస్కరించారు. తన నామినేషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన కారణం లేకుండానే నామినేషన్ ను తిరస్కరించారని అసహనం వ్యక్తం చేశారు. లోథా కమిటీ సూచనల మేరకు ఎన్నికలు జరగడం లేదని అజార్ ఆరోపించారు. హెచ్ సీఏ సస్పెండ్ చేసిన వ్యక్తిని కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాను అనుభవిస్తున్న వివేక్ కు... లోథా కమిటీ సూచనల ప్రకారం అసలు పోటీ చేసే అర్హతే లేదని అజార్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై కోర్టుకు వెళతానని చెప్పారు.