: విద్యుత్ చోరీ చేశారో.. నడిబజార్లో మీ పరువు తీసి పందిరేస్తారు!
విద్యుత్ దొంగలకు హెచ్చరిక. ఇక నుంచి విద్యుత్ చోరీ చేశారో.. మీపేరు సమాజంలో టాంటాం అయిపోతోంది. మీ పేరును నడిబజారులో ప్రకటించి సిగ్గు తీసేస్తారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆదేశాలు అందాయి. విద్యుత్ చౌర్యాన్ని నివారించేందుకు ‘నేమ్ అండ్ షేమ్ క్యాంపెయిన్’ పేరుతో ప్రచారోద్యమం నిర్వహించాలని అందులో కోరింది. ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన(ఉదయ్) పథకానికి సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జనవరి 4న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తీసుకోవాల్సిన చర్యల్లో ‘నేమ్ అండ్ షేమ్ క్యాంపెయిన్’ కూడా ఒకటి. ఒప్పందం ప్రకారం పలు లక్ష్యాలను నిర్దేశించిన కేంద్రం, విద్యుత్ చౌర్యం చేసేవారిని విడిచిపెట్టరాదని కోరింది. వారి పేర్లను బహిరంగంగా ప్రకటించి పరువు తీయడం ద్వారా మరెవరూ అటువంటి పనులు చేయకుండా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ప్రచారం ప్రారంభించాలని డిస్కంలను ఆదేశించింది.