: మార్కెట్ వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బీఎస్ఈ ఐపీఓ 23 నుంచి
దాదాపు రూ. 1500 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా బీఎస్ఈ (బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్) ఐపీఓ జనవరి 23న మార్కెట్లను తాకనుంది. ఆసియాలోనే అత్యంత పురాతన స్టాక్ మార్కెట్ గా చరిత్ర ఉన్న బీఎస్ఈ వాటాల విక్రయం కోసం చాలా సంవత్సరాలుగా మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఓకు మంచి స్పందన రావచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఐపీఓలో భాగంగా 1.54 కోట్ల వాటాలను సంస్థ విక్రయించనుంది. పూర్తి వాటాలో ఇది 30 శాతానికి సమానం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి బీఎస్ఈ అందించిన ఆర్హెచ్పీ (రెడ్ హెర్రింగ్ ప్రాస్టెక్టస్) ప్రకారం, ఐపీఓ ఈ నెల 23 నుంచి 25 వరకూ కొనసాగనుంది. ఒక్కో వాటాను గరిష్ఠంగా రూ. 500కు విక్రయించాలన్నది బీఎస్ఈ అభిమతం కాగా, లోవర్ ఎండ్ బ్యాండ్ పై వాటాలు విక్రయించినా రూ. 1300 కోట్ల వరకూ నిధులు సంస్థకు అందుతాయి. గత సంవత్సరమే బీఎస్ఈ ఐపీఓకు సెబీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, వాటాల విక్రయం తరువాత ఎన్ఎస్ఈలో సైతం సంస్థ లిస్టింగ్ కానుంది.