: అమ్మాయిలకు ముద్దులు పెట్టి రూ.70 వేలు సంపాదించాడట.. విచారణలో వెల్లడించిన క్రేజీ సుమిత్
క్రేజీ సుమిత్.. ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఇతగాడి గురించి యూట్యూబ్ ప్రియులకు బాగా తెలుసు. ఢిల్లీకి చెందిన ఎంబీఏ విద్యార్థి అయిన సుమిత్ కుమార్ సింగ్(21) ఒక్కసారిగా అమ్మాయిల ముందు ప్రత్యక్షమై అకస్మాత్తుగా ముద్దు పెట్టి వారు తేరుకునేంతలోనే పరారవుతాడు. ఇటీవల బయటపడిన ఈ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం సుమిత్ ను, ముద్దులు పెట్టే సమయంలో ఆ వీడియోలను చిత్రీకరించే సుమిత్ స్నేహితుడు సత్యజిత్ కడ్యాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వీరిద్దరు వెల్లడించిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. అమ్మాయికి ముద్దు పెట్టి ఆ వీడియోను యూట్యూబ్ లో పెట్టడం ద్వారా నెల రోజుల్లో రూ.70 వేలు సంపాదించినట్టు చెప్పారు. తాను ముద్దులు పెట్టేది తమ టీంలోని అమ్మాయికేనని, ఈ విషయం ఆమెకు ముందుగానే తెలుసని పేర్కొన్నారు.
యూట్యూబ్ లో మూడేళ్ల క్రితం చూసిన వీడియోతో స్ఫూర్తి పొంది సంచలనాత్మక వీడియోలను అప్ లోడ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకున్నట్టు సుమిత్ పేర్కొన్నాడు. కాగా గతేడాది అక్టోబరులో తన ‘‘ది క్రేజీ సుమిత్’’ యూట్యూబ్ చానల్ కు లక్షమంది సబ్ స్క్రైబర్లు రావడంతో యూట్యూబ్ నుంచి సుమిత్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఏడాది కాలంగా వీరు యూట్యూబ్ అకౌంట్ రన్ చేస్తున్నారని, వారి చానల్ లో ఇప్పటి వరకు 35 వీడియోలను అప్ లోడ్ చేశారని ఢిల్లీ జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు.