: శ్రీకాకుళం వెళ్లాలని సికింద్రాబాద్ రైల్వే స్టేషనుకు వచ్చిన పల్లవి... పోలీసుల లాఠీ ఛార్జ్ లో తల పగిలిన వైనం!
సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వెళ్లాలని సికింద్రాబాద్ రైల్వే స్టేషనుకు వచ్చిన పల్లవి అనే యువతి, తలనిండా రక్తమోడుతూ రైలెక్కాల్సి వచ్చింది. ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ ఎక్కేందుకు స్టేషనుకు వచ్చిన అమెపై పోలీసు లాఠీ విరిగింది. రైలు వచ్చిన వేళ, ఆగీ ఆగకముందే జనరల్ బోగీలోకి ఎక్కేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా ముందుకు ఉరికారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పిందని భావించిన ఇద్దరు కానిస్టేబుళ్లు, తమ చేతిలోని లాఠీలకు పని కల్పించారు. విచక్షణా రహితంగా ప్రయాణికులను కొట్టారు.
ఈ క్రమంలో పల్లవి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆపై ఆమెకు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయించి పంపించినట్టు తెలుస్తోంది. కాగా, అప్పటికే, లాఠీ చార్జ్ చేస్తున్న ఫోటోలు, రక్తం కారుతున్న పల్లవి ఫోటోలను తమ సెల్ ఫోన్లలో కొందరు తీశారు. ఆ యువతి చిత్రాన్ని అన్ని వార్తా సంస్థలూ ప్రచురించాయి. అత్యుత్సాహానికి పోయి లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటనపై రైల్వే పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి అధికారిక సమాచారం లేదు.