: నోట్ల రద్దుపై ప్రధాని మోదీని ప్రశ్నించేది లేదు.. తేల్చి చెప్పిన పీఏసీ కమిటీ
నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నిస్తామన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) వెనకడుగు వేసింది. మోదీని ప్రశ్నించే అవకాశం లేదని స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై మోదీని ప్రశ్నిస్తామంటూ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నేత కేవీ థామస్ పేర్కొన్నారు. ఆయన ప్రకటనపై బీజేపీ నేతలు మండిపడడంతో కమిటీ స్పందించింది. ప్రధానిని ప్రశ్నించే అవకాశం లేదంటూ థామస్ ప్రకటనకు భిన్నంగా పేర్కొంది. పీఏసీ కమిటీ ముందుకు ప్రధానిని పిలిచే సంప్రదాయం లేదని, ఆయనకు సమన్లు జారీ చేసే అవకాశం లేదని బీజేపీ సభ్యులు నిషికాంత్ దూబె, భూపేందర్ యాదవ్, కిరీట్ సోమయ్య పేర్కొన్నారు. బీజేపీ నేతల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన పీఏసీ ప్రధానిని ప్రశ్నించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. కాగా థామస్ వ్యాఖ్యలు పూర్తిగా అనైతికమని, పార్లమెంటరీ వ్యవహారాలకు పూర్తి విరుద్ధమని ఎంపీ దూబె స్పీకర్ కు లేఖ కూడా రాశారు. దానికి స్పందించిన థామస్ .. కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే మోదీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.