: అవసరమైతే మరో సర్జికల్ దాడి: పాక్ కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తీవ్ర హెచ్చరిక
అవసరమైతే భారత సైన్యం మరోమారు సర్జికల్ దాడులు చేస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. సరిహద్దుల్లో పరిస్థితులు లక్షిత దాడులను డిమాండ్ చేసిన పక్షంలో సైన్యం ముందడుగు వేస్తుందని అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన రావత్, "ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే ఉల్లంఘనలు జరుగుతున్నాయి. చొరబాట్లు నిత్యకృత్యమై పోయాయి. ఇటీవలే వాస్తవాధీన రేఖ వద్ద ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాం. అవసరమైతే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేయడానికి సిద్ధం" అని ఆయన అన్నారు.
గత సంవత్సరం సెప్టెంబరులో భారత్ జరిపిన లక్షిత దాడులను ప్రస్తావిస్తూ, పొరుగు దేశానికి మన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేందుకే ఈ తరహా దాడులను వినియోగించుకుంటామని, పాక్ వైపు నుంచి ఆగడాలు ఆగకుంటే, తిరిగి దాడులు జరిపే అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. సెప్టెంబర్ 30న పొరపాటున సరిహద్దులు దాటిన భారత జవాను చందు చవాన్ ను తిరిగి ఇండియాకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకు పాక్ కూడా సానుకూలంగా ఉందని రావత్ పేర్కొన్నారు.