: సెకనులో సినిమా... జియో నుంచి 1 జీబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్!
"ఒక్క సెకనులోనే ఓ సినిమాను డౌన్ లోడ్ చేసుకునేంత వేగంగా ఇంటర్నెట్ సేవలందిస్తాం" సెప్టెంబర్ లో రిలయన్స్ జియో ఉచిత సర్వీసులను పరిచయం చేస్తున్న వేళ, సంస్థ అధినేత ముఖేష్ అంబానీ చెప్పిన మాట ఇది. ఇక అందుకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకున్న రిలయన్స్, తాజాగా, 'రిలయన్స్ జియో గిగా ఫైబర్' పేరిట ఎఫ్టీటీహెచ్ (ఫైబర్ టు ది హోమ్) వైర్డ్ నెట్ వర్క్ పై స్పీడ్ టెస్టును జరిపి, సెకనుకు 1 గిగాబైట్ల వేగాన్ని అందుకుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారి వెల్లడించారు. ముంబై, పుణె ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఎఫ్టీటీహెచ్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, బ్రాడ్ బ్యాండ్ వేగం విషయంలో రిలయన్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఈ సిగ్నల్స్ కమర్షియల్ లాంచింగ్ మరో రెండు నెలల్లో ఉండవచ్చని తెలుస్తోంది.