: భీమునిపట్నంలో వెరైటీ పెళ్లి.. అప్పగింతల తర్వాత పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తలోదారి!


విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నంలో శుక్రవారం విచిత్ర పెళ్లి జరిగింది. పెళ్లికి వధూవరుల తరపు నుంచి పెద్ద సంఖ్యలో బంధువులు హాజరయ్యారు. మేళతాళాలు, బాజాభజంత్రీల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది. కట్నాల చదివింపులు, విందు భోజనాలు కూడా అయ్యాయి. చివరగా అమ్మాయి అప్పగింతలు కూడా పూర్తయ్యాయి. అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ఘట్టం చూసిన వారి కళ్ల వెంట కూడా నీటిబొట్లు జలజలారాలాయి. అయితే అప్పగింతలు పూర్తి కాగానే పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తమ బంధువులతో కలిసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

అసలక్కడేం జరగలేదన్నట్టుగా తట్టాబుట్టా సర్దుకుని బయల్దేరారు. ఇది నిజం పెళ్లి కాదు. 200 ఏళ్లుగా వస్తున్న ఆచారంలో భాగంగా ఈ పెళ్లిని జరిపించారు. దుక్కవానిపాలేనికి చెందిన దుక్క అచ్యుత పెళ్లి కుమారుడుగా, అతనికి మేనకోడలు వరుసయ్యే ఇలిపల్లి రమ్యను పెళ్లికుమార్తెగా అలంకరించి ఈ వివాహ కార్యక్రమం జరిపించారు. భోగి రోజున ఆయా కుటుంబాల వారసులు క్రమం తప్పకుండా ఇలా ఉత్తుత్తి పెళ్లి చేసుకోవడం ఆచారంగా వస్తోంది.

దీని వెనక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దుక్క ఇంటిపేరుతో ఉన్న వ్యక్తితో అదే గ్రామానికి చెందిన కొరగంజి అచ్చియ్యమ్మ అనే యువతికి వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. అంత్యక్రియల రోజు అచ్చియ్యమ్మ భర్త చితిలో పడి సహగమనం చేసింది. దీంతో అప్పటి నుంచి ఆమె పేరంటాలుగా మారిందని గ్రామస్తులు చెబుతారు. గుడికట్టి పూజలు చేస్తున్నారు. దుక్క ఇంటి పేరుతో ఉన్నవారు ఎక్కడున్నా ఏటా ఇక్కడికి వచ్చి ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

  • Loading...

More Telugu News