: మరింత పెరిగిన బంగారం ధర... కాస్త తగ్గిన వెండి ధర
వరుసగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు కొన్ని రోజుల నుంచి పై పైకి వెళుతూ కనిపిస్తున్నాయి. ఈ రోజు పసిడి ధర ఆరు వారాల గరిష్ఠానికి చేరుకుంది. మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తోన్న బంగారం ధర ఈ రోజు కూడా అదే జోరుని కనబరచి రూ. 200 పెరిగి రూ.29,450 (10 గ్రా)కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు మాత్రం రూ.300 తగ్గి 40,950 రూపాయలుగా నమోదయింది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరలోనే ఉండడం, చిల్లర వర్తకుల డిమాండు పెరగడంతో పాటు నగల వ్యాపారుల కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర పెరిగిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యప్తంగా 0.33 శాతం పెరిగిన ఔన్స్ బంగారం ధర 1,195 వద్ద ఉంది. న్యూయార్క్ లో ఔన్స్ వెండి 0.30 శాతం పెరిగి 16.74 డాలర్లుగా నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 29,450 గా నమోదయింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.29,300గా ఉంది. కాగా ఎంసీక్స్ మార్కెట్ లో పదిగ్రాముల బంగారం ధర కాస్త తగ్గి రూ. 28,378గా నమోదయింది.