: సీనీ తారలకైతే టైమ్ కేటాయిస్తారు... ఎంపీలను కలవడానికి టైమ్ ఉండదా?: మోదీపై స్టాలిన్ విమర్శలు
ప్రధాని మోదీపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విమర్శలు కురిపించారు. సినీ తారలతో మాట్లాడటానికైతే మోదీకి సమయముంటుందని... ఎంపీలను కలవడానికి మాత్రం టైమ్ ఉండదని ఆయన విమర్శించారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కోరడానికి మోదీని కలిసేందుకు ప్రయత్నించిన డీఎంకే ఎంపీలకు మోదీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒకవేళ సమయం లేకపోతే మరుసటి రోజైనా అపాయింట్ మెంట్ ఇవ్వాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్, గౌతమిలాంటి సినీ నటులకు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తారని విమర్శించారు. జల్లికట్టుపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పన్నీర్ సెల్వం ప్రధానిని వెంటనే కలిసి జల్లికట్టుపై చర్చించాలని డిమాండ్ చేశారు.