: కోడి పందాల వద్ద బరితెగించిన ఖమ్మం వాసి.. గాల్లోకి కాల్పులు!
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతుండగా, ఖమ్మం జిల్లా నుంచి వెళ్లిన ఓ పందెం రాయుడు, తన కోడి గెలిచిందన్న ఆనందంతో తుపాకితో గాల్లో కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. జంగారెడ్డి గూడెం మండలం శ్రీనివాసపురంలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బరి వద్ద ఈ ఘటన జరుగగా, ఓ టీవీ చానల్ ఈ దృశ్యాలను ప్రసారం చేసింది. సదరు పందెం రాయుడు బరితెగించి, గాల్లోకి కాల్పులు జరుపుతున్న వేళ, పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ, పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కోడి పందాలను ఆపేలా ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో పందాల నిర్వాహకులు మరింత ఉత్సాహంతో కొత్త బరులు ఏర్పాటు చేస్తున్నారు.