: మా ప్రాణాలకు గ్యారంటీ లేదు... పాక్ లో క్రికెట్ ఆడలేమన్న వెస్టిండీస్
పాకిస్థాన్ గడ్డమీద క్రికెట్ ఆడలేమంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. తమ ఆటగాళ్ల ప్రాణాలకు పాకిస్థాన్ లో ముప్పు పొంచి ఉంటుందని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, పాక్ లో పర్యటించాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్య (ఎఫ్ఐసీఏ) ప్రతిపాదన పంపింది. దీనిపై స్పందించిన విండీస్ బోర్డు... తమ ఆటగాళ్ల ప్రాణాలకు ఎవరు భద్రత కల్పిస్తారంటూ ప్రతిపాదనను తిరస్కరించింది. మరోవైపు, తమ దేశంలో పర్యటించాలని, టెస్ట్, వన్డే సిరీస్ లు ఆడాలని పాక్ క్రికెట్ బోర్డు కూడా విండీస్ బోర్డుకు ఇటీవల లేఖ రాసింది. దీనికి సమాధానంగా, పాక్ లో పర్యటించలేమని, తటస్థ వేదిక అమెరికాలోని ఫ్లోరిడాలో ఆడటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని విండీస్ క్రికెట్ బోర్డు చెప్పింది.
2009లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లపై దాడులు జరిగాయి. లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్లు వెళుతున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడి నుంచి శ్రీలంక ఆటగాళ్లు క్షేమంగానే బయటపడినప్పటికీ... అప్పటి నుంచి పాకిస్థాన్ లో పర్యటించడానికి ఏ దేశం కూడా ఆసక్తి చూపడం లేదు. తమ ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు ఉంటుందనే అనుమానం అన్ని దేశాల క్రికెట్ బోర్డుల్లో ఉంది.