: ఐసీయూలోనే రాం విలాస్ పాశ్వాన్... స్వయంగా ఊపిరి తీసుకోలేకపోతున్నారన్న వైద్యులు
శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధ్యక్షుడు రాం విలాస్ పాశ్వాన్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. కృత్రిమ శ్వాసను అందిస్తుండగా, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పరాస్ హెచ్ఎంఆర్ఐ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. 70 ఏళ్ల వయసున్న పాశ్వాన్ కు ఎయిమ్స్ డాక్టర్ సంజీవ్ కుమార్ చికిత్సను అందిస్తున్నారని తెలిపారు. కాగా, ఆయన ఆరోగ్యం కుదుటపడకుంటే, డాక్టర్ల సలహా మేరకు ఢిల్లీకి తరలించే విషయమై నేడు నిర్ణయం తీసుకుంటామని పాశ్వాన్ ఓఎస్డీ ఆర్సీ మీనా వెల్లడించారు. కాగా, ఆయన ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్న ఎల్జేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రికి వస్తుండటంతో, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.