: మహాత్మా గాంధీ స్థానంలో మోదీ... 'ఖాదీ' ఉద్యోగుల తీవ్ర నిరసన
ప్రభుత్వ రంగ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) తీసుకువచ్చిన కొత్త సంవత్సరం క్యాలెండర్, డైరీ వివాదాస్పదమయ్యాయి. 1920లో దేశంలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిస్తూ, మహాత్మా గాంధీ ఉద్యమం ప్రారంభించిన తరువాత, ఆయనే స్వయంగా రాట్నం ఒడికి నూలు తయారీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేవీఐసీ ఏర్పాటు కాగా, సంస్థ చిత్రాల్లో రాట్నం ఒడికే గాంధీ బొమ్మ గుర్తుగా ఉండేది. ఇక ఈ సంవత్సరం క్యాలెండర్, డైరీల కవర్ పేజీపై రాట్నం ఒడికే గాంధీ స్థానంలో మోదీ ఉన్న చిత్రాలను ప్రచురించడాన్ని సంస్థ ఉద్యోగులే తీవ్రంగా తప్పుపడుతున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ప్రభుత్వ మెప్పు కోసం అధికారులు మార్చారని మండిపడుతున్నారు.
వాస్తవానికి ఈ కవర్ పేజీలపై కేవలం ధోవతి కట్టుకుని, ఎలాంటి పై ఆచ్చాదనా లేకుండా చరకా ముందు కూర్చున్న గాంధీ చిత్రాన్ని దశాబ్దాలుగా ముద్రిస్తూ వచ్చిన కేవీఐసీ, ఇప్పుడిలా మార్చడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, మౌన ప్రదర్శన జరపాలని ఉద్యోగులు నిర్ణయించారు. కేవలం గాంధీ సిద్ధాంతాలు, విధానాలపై ఆధారపడి తమ సంస్థ ఏర్పాటైందని, కేవీఐసీ ఆత్మ ఆయనేనని, ఆయన్ను మరచిపోయే సమస్యే లేదని కేవీఐసీ చైర్మన్ సక్సేనా వెల్లడించారు. దీర్ఘకాలంగా మోదీ ఖద్దరు దుస్తులను ధరిస్తూ, వాటిని ప్రజల్లోకి తీసుకెళుతున్నారని, అందువల్లే ఖాదీకి మరింత ప్రచారం కోసం ఆయన చిత్రాన్ని వాడామని వివరణ ఇచ్చారు.