: హైదరాబాద్ లో విషాదం.. కొడుకు చనిపోయాడనుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. కొడుకు చనిపోయాడని భావించిన ఓ తల్లి భయంతో ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబగాం గ్రామానికి చెందిన జి.సునీత(23), ఈశ్వరరావు దంపతులు. బంజారాహిల్స్ సమీపంలోని ఇందిరానగర్ లో నివసిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు నిహార్, మరో కుమార్తె వున్నారు. ఈశ్వర్ సినీ పరిశ్రమలో పనిచేస్తుంటాడు. రెండు రోజుల క్రితం ఆయన విశాఖపట్టణం వెళ్లాడు. గురువారం ఉదయం నిహార్ ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. అయితే ఎంతకీ రాకపోవడంతో భయపడిన సునీత ఆ ప్రాంతమంతా గాలించినా కుమారుడి ఆచూకీ కనిపించలేదు. దీంతో ఇంటి బయట కొడుకు రాకకోసం ఏడుస్తూ కూర్చుంది.
ఈ క్రమంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత నిహార్ ఇంటికొచ్చాడు. దీంతో కోపం పట్టలేని తల్లి ఎక్కడికెళ్లావంటూ విసురుగా చేయి పట్టుకుని లోపలికెళ్లి స్నానం చేయమని చెప్పింది. తల్లిమాటను నిహార్ లెక్కచేయకపోవడంతో చేయి పట్టుకుని లాగింది. దీంతో ఆ పక్కనే ఉన్న మంచంకోడు నిహార్ తలకు తగిలి రక్తస్రావమైంది. దీంతో అతడు స్పృహతప్పి పడిపోయాడు. ఎంత లేపినా కొడుకు లేవకపోవడంతో చనిపోయాడని భావించి భయంతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి కళ్లు తెరిచి చూసిన నిహార్ చీరకు వెళాడుతున్న తల్లిని చూసి కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. నిహార్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.