chandrababu: పన్నీర్ సెల్వంతో ముగిసిన భేటీ.. తమిళనాడులో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని కోరిన చంద్రబాబు
విజయవాడకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు అర్ధగంట జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాల్లోని పలు అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. తెలుగుగంగ ఒప్పందం ప్రకారం కృష్ణాజలాల నుంచి చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాలని చంద్రబాబుని పన్నీరు సెల్వం కోరారు. అయితే, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలు కూడా 5 టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని ఆయనకు చంద్రబాబు గుర్తుచేశారు. తమిళనాడు రూ.443 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన పన్నీర్ సెల్వం రేపు కొంత మేర బకాయిలు విడుదల చేస్తామని అన్నారు.
పక్కనున్న రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తాము ఇప్పటికే ఒక టీఎంసీ నీరు విడుదల చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తమిళనాడుతో 5 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నామని తెలిపిన చంద్రబాబు.. ఆ ప్రకారం తెలంగాణ నుంచి 2.5 టీఎంసీలు రావాలని తెలిపారు. తమిళనాడులో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. తమిళ కూలీలు అటవీప్రాంతానికి వచ్చి చేస్తోన్న ఎర్రచందనం అక్రమరవాణాను నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు.