: ఇది నాన్నగారు చేయాలనుకున్న పాత్ర... నేను చేశాను: ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద బాలయ్య

గౌతమి పుత్ర శాతకర్ణి ఒక వీరుడని సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ కు బాలయ్యతో పాటు సినిమా దర్శకుడు క్రిష్, నటి శ్రియ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ... ఇది తెలుగు జాతి విజయంగా భావిస్తున్నానని అన్నారు. అసమాన శూరుడి పాత్రను తాను చేయడం ఓ అదృష్టమని అన్నారు. అద్భుతమైన స్పందనను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
పంచభక్ష పరమాన్నం అందించినట్లు సినిమాకు పనిచేసిన బృందం ఈ సినిమాలో అన్నిటినీ మిళితం చేశారని బాలయ్య చెప్పారు. సాయిమాధవ్ మంచి మాటలు అందించారని అన్నారు. ఈ సినిమా విజయానికి అందరూ సహకరించారని చెప్పారు. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ ధన్యవాదాలని చెప్పారు. ఇది నాన్నగారు (ఎన్టీఆర్) చేయాలనుకున్న పాత్ర అని, ఆ పాత్రను తాను చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.