: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐడియా!
ఉచిత మంత్రంతో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో ఊహించని విధంగా కస్టమర్లను సొంతం చేసుకోవడంతో మిగతా టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ తమ వినియోగదారులను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇటీవలే ఎయిర్‌టెల్ తమ 4జీ నెట్వర్క్లోకి అప్గ్రేడ్ అయ్యే వినియోగదారులకు ఏడాదంతా ఉచిత 4జీ డేటాను ఇస్తామని ప్రకటించింది.
తాజాగా ఐడియా కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకుంది. ఎంపికచేసిన అపరిమిత కాలింగ్ ప్లాన్స్లో డేటా వాడుక పరిమితిని పెంచినట్లు పేర్కొంది. తమ కొత్త 4జీ హ్యాండ్సెట్లలోకి అప్గ్రేడ్ అయ్యే వినియోగదారులకు అదనంగా 3జీబీ మొబైల్ బ్రాడ్బాండ్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌తో తమ వినియోగదారులంతా తమ ప్లాన్స్పై ఉచిత డేటాను పొందవచ్చని చెప్పింది.
అంతేగాక కొత్త ఐడియా 4జీ డేటా ఆఫర్ కింద వినియోగదారులు రూ.348తో రీచార్జ్ చేసుకుంటే పలు ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. ఈ రీచార్జ్‌తో ఇప్పటికే ప్రీపెయిడ్ 4జీ హ్యాండ్ సెట్లు ఉన్న కస్టమర్లు 28 రోజుల పాటు 1జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లను పొందవచ్చని, కొత్త 4జీ హ్యాండ్సెట్ల వినియోగదారులు దానికి మరింత అదనంగా 3జీబీ డేటాను పొందుతారని చెప్పింది. ఇక ఐడియా పోస్టు పెయిడ్ వినియోగదారులయితే రూ.499 రెంటల్ ప్లాన్పై సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుందని ఐడియా ప్రతినిధులు తెలిపారు. దీంతో 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లు అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్, ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్ సహా 3జీబీ ఉచిత డేటాను పొందవచ్చని పేర్కొన్నారు.
ఇక, 4జీ హ్యాండ్సెట్ యూజర్లు కానివారి కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌తో పాటు 1జీబీ ఉచిత డేటా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారు రూ.999 రెంటల్ ప్లాన్ను యాక్టివేట్ చేసుకుంటే రూ.499 ప్లాన్పై ఉన్న అన్ని ప్రయోజనాలనూ పొందవచ్చని పేర్కొన్నారు. దానితో పాటు రోమింగ్పై ఉచిత కాల్స్, 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లకు 8జీబీ మొబైల్ బ్రాడ్బాండ్ పొందవచ్చని, ఇతర కస్టమర్లు 5జీబీ డేటా ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. తమ వినియోగదారులందరికీ ఈ ఏడాది మొత్తం ఈ రెంటల్ ప్లాన్స్పై అదనపు 3జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.