: ఆయా సంస్థల ఖాతా వివరాలు ఆన్‌లైన్‌లో ఉండాలి... లేకుంటే చర్యలు: కేంద్ర ప్రభుత్వం


దేశ అభివృద్ధికి నిరోధంగా మారిన న‌ల్ల‌ధ‌నం, అవినీతిపై ఉక్కుపాదం మోపిన కేంద్ర స‌ర్కారు ఇటీవ‌లే భారీ సంఖ్య‌లో స్వచ్ఛంద సంస్థల లైసెన్సుల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ప‌లు ఆదేశాలు జారీ చేసింది. ఆయా స్వ‌చ్ఛంద సంస్థ‌లు బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉంచాలని కేంద్ర హోంశాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు చేసింది. త‌మ సూచ‌న‌ను పాటించ‌క‌పోతే చ‌ర్య‌లు తప్పవని హెచ్చరించింది. విదేశాల నుంచి వ‌స్తోన్న‌ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే తాము ఈ ఆదేశాలు జారీచేస్తున్న‌ట్లు వివ‌ర‌ణ ఇచ్చింది.

అంతేగాక ఇక‌పై ఎన్‌జీవోల వార్షిక పన్ను రిటర్నుల హార్డుకాపీలను స్వీకరించబోమని కూడా తెలుపుతూ... అవన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంచాల‌ని చెప్పింది. ఈ సూచ‌న‌లు పాటించ‌ని సంస్థలు లేదా వ్యక్తులు భార‌త‌ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం–2010 కింద శిక్షార్హులవుతారని తెలిపింది. స్వ‌చ్ఛంద‌ సంస్థలు తమ ఆదాయ వ్యయాల వివరాలు, బ్యాలెన్స్‌ షీట్‌ల స్కానింగ్‌ కాపీలను డిజిటల్‌ సంతకం చేసిన నివేదికతో స‌మ‌ర్పించాల‌ని, అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలల్లోపే ఈ వివరాల‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. తాజాగా కొంద‌రు రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి తమ రిటర్నులను హార్డు కాపీల రూపంలో దాఖలు చేశారని తాము వాటిని స్వీక‌రించ‌లేద‌ని తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News