: పెద్ద నోట్ల రద్దు ప్రభావం... గణనీయంగా తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం!


పెద్ద నోట్ల రద్దు ప్రభావం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని కూడా తాకింది. డిసెంబర్ 30 తరువాత హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. సాధారణంగా రోజుకు రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకూ ఉండే రాబడి సగానికి సగం పడిపోయిందంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే రూ. 3 కోట్లకు మించిన ఆదాయం లభించగా, మిగతా రోజుల్లో ఆదాయం తగ్గినట్టు టీటీడీ వెల్లడించింది. గత సంవత్సరం మొత్తం రూ.1,018 కోట్ల ఆదాయం రాగా, అది ఆల్ టైం రికార్డు!

ఇక ఈ సంవత్సరం జనవరి 1న రూ. 2.38 కోట్లు, 2న రూ. 2.74 కోట్లు , 3న రూ. 1.10 కోట్లు, 4న రూ. 1.24 కోట్లు, 5న రూ. 1.90 కోట్లు, 6న రూ. 1.72 కోట్లు, 7న రూ. 2.22 కోట్లు, 8న రూ. 3.45 కోట్లు, 9న రూ. 1.45 కోట్లు, 10న రూ. 1.71 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజల వద్ద తగినంత కరెన్సీ లేకపోవడమే హుండీ ఆదాయం తగ్గడానికి కారణమని టీటీడీ పెద్దలు వ్యాఖ్యానించారు. భక్తుల సంఖ్య తగ్గకపోయినా, ఆదాయం తగ్గడానికి ఇదే కారణమని, నగదు విత్ డ్రాపై ఆంక్షలు ఉండటం ప్రభావం చూపుతోందని అన్నారు.

కాగా, ఇదే సమయంలో ఆన్ లైన్ మార్గంలో స్వామివారికి వచ్చే ఈ - హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. 2015లో రూ. 6 కోట్లుగా ఉన్న ఈ-హుండీ ఆదాయం, 2016లో రూ. 8.8 కోట్లకు పెరిగింది. నవంబర్‌ తరువాత రూ. 3 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఇంకా పాత నోట్లను భక్తులు హుండీలో వేస్తున్నారని, ఈ సంవత్సరంలో హుండీలో వచ్చిన రూ. 1.60 కోట్ల పాత నోట్లను మార్చేందుకు ఆర్బీఐతో చర్చిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News