: 17న జయ మేనకోడలు దీప రాజకీయ అరంగేట్రం?.. ఆమె గురించి ఆరా తీస్తున్న బీజేపీ
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ జయంతి రోజైన ఈనెల 17న జయ మేనకోడలు దీప రాజకీయ అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో తొలి నుంచి సభ్యుడిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తిరుచ్చి సౌందర్ రాజన్.. దీపకు మద్దతు ప్రకటించారు. ఆమె నాయకత్వాన్ని బలపరుస్తూ తిరుచ్చిలో ఆయన అంటించిన పోస్టర్లు కలకలం రేపాయి. ఎంజీఆర్ జయంతి రోజున ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని, ఆమె రాకతో తమిళ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పొడగిట్టని వారు ఏకతాటిపైకి వచ్చి కొత్త పార్టీని స్థాపించేందుకు పావులు కదుపుతున్నారు. ఎంజీఆర్, జయలలిత సిద్ధాంతాలకు అనుగుణంగా కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శశికళ వ్యతిరేకులందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త పార్టీ పగ్గాలను చేపట్టాలంటూ దీపా జయకుమార్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో దీపా జయకుమార్ గురించి బీజేపీ నేతల వద్ద ఆ పార్టీ చీఫ్ అమిత్షా ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీపకు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు గురించి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.