: దేశం మీసం తిప్పేందుకు సిద్ధమవుతున్న బాలయ్య.. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న 'గౌతమీపుత్ర'.. అభిమానుల కోలాహలం
భారతదేశాన్ని ఏలిన మహావీరుని కథ మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రేక్షకులను అలరించేందుకు రానున్నాడు. తొలి రోజే ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అభిమాన హీరో చిత్రాన్ని సూపర్ హిట్ చేసేందుకు అభిమానులు పడుతున్న తాపత్రయం అంతాఇంతా కాదు.
సినిమా విడుదలవుతున్న థియేటర్లను అందంగా ముస్తాబు చేశారు. బాలయ్యకు దిష్టి తగలకుండా పోస్టర్లకు నిమ్మకాయ దండలు వేశారు. శాతకర్ణి జీవితంలోని కీలక ఘట్టాలను తీసుకుని క్రిష్ ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. అజేయ చక్రవర్తిగా కుమారుడు శాతకర్ణిని చూసేందుకు తల్లి గౌతమిబాలశ్రీ పడే తాపత్రయం, భార్యతో శాతకర్ణికి ఉండే మానసిక సంఘర్షణను తెరకెక్కిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కడా మిస్సవకుండా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అయితే సీక్వెల్ తీసేందుకు కూడా క్రిష్ సిద్ధమనే వార్తలు వినిపిస్తున్నాయి. వణికిస్తున్న చలిలోనూ బాలయ్య అభిమానులు థియేటర్లకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.