: చంద్రబాబునాయుడు సమక్షంలోనే జేసీ రౌడీలా మాట్లాడారు: శ్రీకాంత్ రెడ్డి మండిపాటు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో తనపై శ్రీకాంత్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మండిపడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ.. సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలోనే జేసీ రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలు వింటుంటే జానీవాకర్ తో పాటు డ్రగ్స్ కు కూడా అలవాటుపడ్డారన్న అనుమానం వస్తోందని విమర్శించారు.
దిగజారుడు రాజకీయాలు చేయడంలో జేసీ దిట్ట అని, ఆయనలా చెంచా రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని అన్నారు. తనకు సంస్కారం ఉందని, ప్రాజెక్టులపై చర్చకు తాను సిద్ధమని చెప్పిన శ్రీకాంత్ రెడ్డి, వేదిక సిద్ధం చేస్తే చర్చకు తాను సిద్ధమని జేసీకి సవాల్ విసిరారు. కాగా, జేసీ దివాకర్ రెడ్డిని జానీ వాకర్ రెడ్డి అని, ఆయన నాలుక కోస్తానని శ్రీకాంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. కడపలో ఈరోజు జరిగిన బహిరంగసభలో దానికి బదులుగా జేసీ సమాధానమిస్తూ.. ‘ఎవడయ్యావాడు శ్రీకాంత్ రెడ్డి .. నా గురించి మాట్లాడతాడా! నా నాలుక కోస్తానంటాడా?..’ అంటూ ఒక రేంజ్ లో మండిపడ్డారు.