: రెండవ ప్రపంచ యుద్ధం 'బ్రేకింగ్ న్యూస్' జర్నలిస్టు క్లేర్ హాలింగ్ వర్త్ మృతి!
రెండవ ప్రపంచ యుద్ధ వార్తను బ్రేకింగ్ న్యూస్ గా ఇచ్చిన ఘనతను సాధించిన ప్రఖ్యాత బ్రిటిష్ మహిళా జర్నలిస్టు క్లేర్ హాలింగ్ వర్త్ (105) కన్నుమూశారు. ఆమె మృతికి అంతర్జాతీయ, జాతీయ స్థాయి జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, జర్మన్ ట్యాంకులు కెట్వైస్ పొలిష్ పట్టణం చుట్టుముట్టాయంటూ రెండవ ప్రపంచయుద్ధ వార్తను ప్రపంచానికి ముందుగా అందించింది ఆమే! లండన్ డెయిలీ టెలిగ్రాఫ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమె 1939, ఆగస్టులో నాజీల దాడిని రిపోర్టు చేసి రెండో ప్రపంచ యుద్ధ వార్తను బ్రేకింగ్ న్యూస్ గా ఇచ్చారు.
కాగా, 1911 అక్టోబర్ 10న ఇంగ్లాండ్ లో ఆమె జన్మించింది. తన 27 ఏళ్ల వయసులో లండన్ డైలీ టెలిగ్రాఫ్ పత్రికలో జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. తాను రిపోర్టర్ గా చేరిన ఒక వారంలోనే రెండవ ప్రపంచయుద్ధ వార్తను బ్రేకింగ్ న్యూస్ గా ఇచ్చి పేరు సంపాందించుకుంది. అలాగే, వియత్నాం యుద్ధం, అల్జీరియన్ స్వాతంత్ర్య పోరాటంలోని క్లిష్టమైన ఘట్టాలను ఆమె కవర్ చేశారు. 1946లో జెరూసలెంలో కింగ్ డేవిడ్ హోటల్ ను ఉగ్రవాదులు కూల్చివేసిన ఘటన జరిగినప్పుడు.. ఆ ప్రాంతానికి ఆమె కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్నారు. నాడు జరిగిన ఈ సంఘటనలో సుమారు 100 మంది మృతి చెందారు.
విధి నిర్వహణలో పలుసార్లు మృత్యువు నుంచి తప్పించుకున్న ఆమె, ‘వాట్ ద పేసర్ సే’ అనే జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. హాలింగ్ వర్త్ తన జీవిత చరమాంకంలో కూడా అంతర్జాతీయ పత్రికలకు పలు వ్యాసాలు రాశారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, ఆసియా వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఆమె చాలా వ్యాసాలు రాశారు. బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి టెడ్ హీత్, మాజీ హాంగ్ కాంగ్ గవర్నర్ క్రిస్ పాటెన్ సహా, పలు బ్రిటిష్ సైనికాధికారులు ఆమెకు అభిమానులుగా ఉండటం విశేషం. వృత్తిపరంగా లింగ వివక్ష ఎదుర్కొన్న హాలింగ్ వర్త్, క్వీన్ ఎలిజబెత్ -II బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆర్డర్ ఆఫ్ ఆఫీసర్ గా పనిచేశారు.