: నోట్ల రద్దుతో కుదేలైన భారత్: వరల్డ్ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి మరింతగా తగ్గనుందని, భారత ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు తరువాత వృద్ధి రేటు మరింతగా కుదేలైందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. తొలుత ఈ యేటి భారత వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండవచ్చని ప్రకటించిన ప్రపంచ బ్యాంకు దాన్ని 7 శాతానికి సవరిస్తున్నామని, ఈ వృద్ధి కూడా చాలా దేశాలకన్నా మెరుగైనదేనని అభిప్రాయపడింది.
"వ్యవస్థలో ఉన్న కరెన్సీలోని అత్యధిక మొత్తాన్ని వెనక్కు తీసుకుని కొత్త నోట్లను జారీ చేయడం ద్వారా నవంబర్ నుంచి వృద్ధి మందగించింది. దీని ప్రభావం మూడో త్రైమాసికంలో స్పష్టంగా కనిపించగా, జనవరి - మార్చి మధ్య కాలంపైనా పడనుంది" అని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. ఇండియాలో 80 శాతం లావాదేవీలు నగదుతోనే జరుగుతుండేవని గుర్తు చేస్తూ, నోట్ల రద్దుతో ఇండియాలో వ్యాపారం మందగించిందని, భారతీయుల ఆర్థిక వ్యవహారాలు తగ్గాయని నోట్ల రద్దు తరువాత భారత్ పై తన తొలి నివేదికలో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.